This is a premium alert message you can set from Layout! Get Now!

Hanuman Chalisa ఆవిర్భావ సంఘటన in Telugu

0

 🌿🌼🙏 Hanuman Chalisa ఆవిర్భావ సంఘటన🙏🌼🌿

ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

Hanuman Chalisa in Telugu


ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !

తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?

తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.

పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.

తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.

ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.

🌿🌼🙏తెలుగులో Sri Hanuman Chalisa, అనువాదం శ్రీ ఎం ఎస్ రామారావు గారు 🙏🌼🌿

ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీరామం* *భూయో భూయో నమామ్యహం

హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః

రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః

ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః

లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః

స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః

తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్!!


శ్రీ హనుమాను గురుదేవు చరణములు

ఇహపర సాధక శరణములు ||

బుద్ధిహీనతను కలిగిన తనువులు

బుద్భుదములని తెలుపు సత్యములు ||శ్రీ||

1. జయ హనుమంత జ్ణానగుణవందిత

జయపండిత త్రిలోక పూజిత ||

2.రామదూత అతులిత బలధామ

అంజనీపుత్ర పవనసుతనామ ||

3. ఉదయభానుని మధురఫలమని

భావన లీల అమృతమును గ్రోలిన ||

4. కాంచనవర్ణ విరాజితవేశా

కుండలమండిత కుంచితకేశా ||శ్రీ||

5. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి

రాజపదవి సుగ్రీవున నిలిపి ||

6. జానకీపతి ముద్రిక దోడ్కొని

జలధి లంఘించి లంక జేరుకొని ||

7. సూక్ష్మరూపమున సీతను చూచి

వికటరూపమున లంకను గాల్చి ||

8. భీమరూపమున అసురుల జంపిన

రామకార్యమును సఫలముజేసిన ||శ్రీ||

9. సీత జాడకని వచ్చిననిను కని

శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని ||

10. సహస్రరీతుల నిను కొనియాడగ

కాగలకార్యం నీపై నిడగా ||

11. వానరసేనతో వారధిదాటి

లంకేశునితో తలపడి పోరి ||

12. హోరుహోరున పోరుసాగిన

అసురసేనల వరుసన గోల్చిన ||శ్రీ||

13. లక్ష్మణ మూర్చతో రాముడడలగ

సంజీవిదెచ్చిన ప్రాణప్రదాత ||

14. రామలక్ష్మణుల అస్త్రధాటికి

అసురవీరులు అస్తమించిరి ||

15. తిరుగులేని శ్రీరామ బాణము

జరిపించెను రావణ సంహారము ||

16. ఎదిరిలేని ఆ లంకాపురమున

ఏలికగా ఆ విభీషణు చేసిన ||శ్రీ||

17. సీతారాములు నగవులు గనిరి

ముల్లోకాల హారతులందిరి ||

18. అంతులేని ఆనందాశ్రువులే

అయోధ్యాపురి పొంగిపొరలే ||

19. సీతారాముల సుందర మందిరం

శ్రీకాంతుపదం నీ హృదయం ||

20. రామచరిత కర్ణామృతగానా

రామనామ రసామృతపాన ||శ్రీ||

21. దుర్గమమగు ఏ కార్యమైన

సుగమమేయగు నీ కృపజాలిన ||

22. కలుగు సుఖములు నిను శరణన్న

తొలగు భయములు నీ రక్షణయున్న ||

23. రామద్వారపు కాపరివైన నీ

కట్టడిమీర బ్రహ్మాదుల తరమా ||

24. భూతపిశాచ శాకినీ ఢాకినీ

భయపడి పారు నీ నామ జపమువిని ||శ్రీ||

25. ధ్వజావిరాజా వజ్రశరీరా

భుజబలతేజా గదాధరా ||

26. ఈశ్వరాంశ సంభూత పవిత్ర

కేసరీపుత్ర పావనగాత్ర ||

27. సనకాదులు బ్రహ్మాదిదేవతలు

శారద నారద ఆదిశేషులు ||

28. యమకుబేర దిక్పాలురు కవులు

పులకితులైరి నీ కీర్తిగానముల ||శ్రీ||

29. సోదర భరత సమానాయని

శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా ||

30. సాధులపాలిట ఇంద్రుడవన్నా

అసురలపాలిట కాలుడవన్నా ||

31. అష్టసిద్ధి నవనిధులకు దాతగా

జానకీమాత దీవించెనుగా ||

32. రామరసామృతపానము చేసిన

మృత్యుంజయదవై వెలసిన ||శ్రీ||

33. నీనామ భజన శ్రీరామ రంజన

జన్మ జన్మాంతర దుఃఖభంజన ||

34. ఎచ్చటుండినా రఘువరదాసు

చివరకు రాముని చేరుట తెలుసు ||

35. ఇతర చింతనలు మనసున మోతలు

స్థిరముగ మారుతి సేవలు సుఖములు ||

36. ఎందెందున శ్రీరామ కీర్తన

అందందున హనుమాను నర్తన ||శ్రీ||

37. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా

శుభమగు ఫలములు గలుగుసుమా ||

38. భక్తిమీరగ గానముసేయగ

ముక్తి గలుగు గౌరీశులసాక్షిగ ||

39. తులసీదాస హనుమాను చాలీసా

తెలుగున సుళువుగ నలుగురు పాడగ ||

40. పలికిన సీతారాముని పలుకున

దోశములున్న మన్నింపుమన్నా ||శ్రీ||


మంగళ హారతి గొను హనుమంత - సీతారామ లక్ష్మణ సమేత |

నా అంతరాత్మ నిలుమో అనంత - నీవే అంతా శ్రీహనుమంత ||

సంపూర్ణము ఓం శాంతిః శాంతిః శాంతిః

జై శ్రీరామ్  ! ! జై హనుమాన్

Post a Comment

0 Comments
Post a Comment
To Top